తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల పేర్లను సీఎం కేసీఆర్ ఏసీబీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై సీఎం కేసీఆర్ మాట్లాడాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలలో స్కాంలు జరుగుతున్నాయని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ లో అవినీతి, ధరణిలో అవినీతి, మిషన్ కాకతీయలో అవినీతి, దళిత బంధులోనూ అవినీతి.. ఇలా ప్రభుత్వ పథకాలు అన్నింటిలో దోపిడీ జరుగుతుందన్నారు.
డబ్బులు పంచి మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోకుండా.. తప్పు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. దళిత బందులో జరుగుతున్న అవినీతిపై కేసీఆర్ హైకోర్టుకు లేఖ రాయాలని.. లేదా ఏసీబీ డీఐజీకి అవినీతి చిట్టా వివరాలు ఇవ్వాలన్నారు.