వరంగల్ ఎంజీఎంలో కేఎంసీ పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమెను వేధించిన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను ఇవాళ హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పారు.
అయితే సైఫ్‌కు మద్దతుగా ఎంజీఎం ఆస్పత్రి వద్దకు వైద్య విద్యార్థులు భారీగా తరలివచ్చారు. పోలీసులు, మీడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రీతి ఆత్మహత్యాయత్నంపై ఎలాంటి ఆధారాల్లేవని ఎంజీఎం వైద్యవిద్యార్థులు తెలిపారు. సైఫ్ తప్పు చేశాడని… ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దని కోరారు. పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరుతూ వైద్యవిద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఒకే కోణంలో కేసులు విచారణ చేస్తున్నారని తెలిపిన వారు చట్టం ప్రకారం నిష్పాక్షికంగా జరగాలని డిమాండ్ చేశారు.
ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఘటన కేసు వివరాలు తెలుసుకునేందుకు సీపీ రంగనాథ్ ఆస్పత్రికి చేరుకున్నారు. సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌ను కలిసి ఘటనపై ఆరా తీశారు.