గత కొన్నాళ్లుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ తో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ అగ్ర నేతలు అంత ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు.అయితే ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలపై రాజగోపాల్ రెడ్డి తాజాగా స్పందించారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో తాను కొనసాగేది.. లేనిది.. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న కేసీఆర్ ను గద్దెదించే వరకు పోరాటం సాగిస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అప్పటివరకు తాను రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమాలు, ఆత్మబలిదానాల తో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో పోరాటాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్టానానిదే అని పేర్కొన్నారు. అంతేకాదు పదవులకోసం పార్టీ మారే ఆలోచన తనకు లేదని కోమటిరెడ్డి పునరుద్ఘాటించారు.