వరంగల్ అధికారులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. నగర ప్రజలకు రోజూ తాగునీళ్లు ఎందుకివ్వడం లేదు? ఏడాది నుంచి చెబుతున్నా ఎందుకు అమలు కావడం లేదు? కారణాలేమిటని ప్రశ్నించారు. వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఏం చేస్తారు? ఎలా చేస్తారు? సమగ్రమైన ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు.
నగరంలోని 66 డివిజన్లకు తాగునీళ్లు అందించేందుకు రూ.50 కోట్లతో వేసవి ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర అధికారులు మంత్రికి వివరించారు. దీన్ని తక్షణం అమలు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరంగల్ నగరాభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వారం రోజులుగా వరంగల్లో నీటి సరఫరా నిలిచిపోయిన అంశం, భవిష్యతులో తలెత్తే ఇబ్బందులపై ప్రధానంగా చర్చించారు. నీళ్లు ఉన్నాయని, నీటి శుద్ధీకరణ కేంద్రాలున్నా.. రోజూ ఎందుకివ్వడం లేదని మంత్రి కేటీఆర్ అడిగారు. క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు లైన్మెన్లు లేరని అధికారులు తెలిపారు. ‘న్యాక్’ సంస్థలో శిక్షణ పొందిన 130 మందిని ఒప్పంద పద్దతిన నియమించేందుకు మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు.