రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి వరంగల్ చేరుకున్న కేటీఆర్ అక్కడి నుంచి శాయంపేటకు వెళ్లారు. అక్కడ 261 ఎకరాల్లో రూ.900 కోట్లతో నిర్మించనున్న కాకతీయ టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆ పార్కులో పెట్టుబడులు పెట్టనున్న యంగ్ వన్ కంపెనీకి కూడా కేటీఆర్ భూమిపూజ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. వరంగల్‌కు మళ్లీ పూర్వ వైభవం తెస్తామని ప్రకటించారు. చల్లా ధర్మారెడ్డి చొరవ వల్లే టెక్స్టైల్ పార్కు వచ్చిందని తెలిపారు.
“యంగ్ వన్ కంపెనీలో మొత్తం 11 పరిశ్రమలు వస్తాయి. ఇక్కడి పరిశ్రమల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి. మేడ్ ఇన్ వరంగల్ దుస్తులు అనేక విదేశాలకు వెళ్తాయి. మన దేశంలో వ్యవసాయ, టెక్స్టైల్ రంగంలో విస్తృత అవకాశాలు. టెక్స్టైల్ రంగంలో మనకంటే బంగ్లాదేశ్, శ్రీలంక ముందున్నాయి:. మనదేశం టెక్స్టైల్ రంగంలో అనేక సంస్కరణలు రావాలి. కేంద్రం ఇటీవలే మేల్కొని పీఎం మిత్ర పథకం తెచ్చింది. మనం ఎప్పుడో తెచ్చిన పథకాలను కేంద్రం ఇప్పుడు తెస్తోంది.” అని కేటీఆర్ అన్నారు.