తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అటు అధికార బీఆర్ఎస్.. ఇటు ప్రతి పక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఒకరిపై మరొకరూ విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ మండలంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తే మళ్లీ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో విలీన చేస్తారని ఆరోపించారు.
ఇక్కడి సంపదను కొల్లగొడుతారని మండిపడ్డారు. ఒక్క ఓటు తప్పుతో తెలంగాణ మళ్లీ అంధకారం అవుతుందని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని కోరారు. కరీంనగర్ లో ఓ భూకబ్జదారుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ అమ్ముకుందన్నారు. బీజేపీ అభ్యర్ధి ఎన్నికల తర్వాత కంటికి కూడా కనిపించడని అలాంటి నేతలను గెలిపిస్తే ఏం అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. నిత్యం ప్రజల మధ్య తిరిగి, ప్రజా సమస్యలు తీర్చే నాయకుడు కావాలో లేదంటే ఎన్నికల సమయంలో కనిపించేవాళ్లు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.