వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరుగాంచిన జనగామ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి ఆయన సొంత కూతురే ఆయనపై తిరగబడడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ముత్తిరెడ్డి పై కేసు పెట్టడం చర్చనీయాంశమైంది.
159 గజాల నాచారం ల్యాండ్ కమర్షియల్ బిల్డింగ్ విషయంలో ఆమె ఫిర్యాదు చేశారు. కెనరా గ్రాండ్ కు తన తండ్రి అక్రమ అగ్రిమెంట్ చేశారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు తుల్జా భవాని రెడ్డి. దీంతో ముత్తిరెడ్డి పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనపై సెక్షన్ 406, 420, 463, 464, 468, 471 R/W, 156 సిఆర్పిసి ప్రకారం కేసులు నమోదు చేశారు.
అయితే భూమి కబ్జా చేశాడంటూ కన్న కూతురు కేసు పెట్టడంతో భగవద్వేగానికి లోనయ్యారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. తాను ఏ తప్పు చేయలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రత్యర్ధులు తనను రాజకీయంగా ఎదుర్కోలేక తన బిడ్డతో కేసు పెట్టించారని ఆరోపించారు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయని అన్నారు. అలాగే తమ సమస్యను కూడా ఇంట్లోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.