బాలింతల మృతి కేసు.. స్పందించిన స్థానిక ఎమ్మెల్యే

-

హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వచ్చి ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారంటూ బాధితుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. మరోవైపు ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే బలాల, పోలీసులు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని బాధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

“ఈ ఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. బాలింతల మృతి విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకువెళ్తాం. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.” అని స్థానిక ఎమ్మెల్యే బలాల హామీ ఇచ్చారు.

మరోవైపు ఈ ఘటనపై ఏసీపీ దేవేందర్ స్పందించారు. “ఇద్దరు మహిళలు ప్రసవం తర్వాత మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి పంపించారు. కానీ వాళ్లు అక్కడికి వెళ్లాక చికిత్స పొందుతూ చనిపోయారు. మలక్‌పేట్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళలు చనిపోయారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళలకు పోస్టుమార్టం నిర్వహిస్తాం. ఆ తర్వాత వచ్చే నివేదికను బట్టి చర్యలు తీసుకుంటాం.” అని ఏసీపీ దేవేందర్ తెలిపారు.

మలక్‌పేట్‌ ఆస్పత్రి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చనిపోయిన మహిళల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని బీఆర్ఎస్, టీడీపీ, బీఎస్సీ పార్టీల నేతలు భరోసానిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news