హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వలిగొండ మండలం సంగం పరిధిలో మూసీ వంతెన పైనుంచి వరదనీరు ప్రవహించడం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బొల్లేపల్లి-చౌటుప్పల్ మార్గంలో, రుద్రవెల్లి వద్ద కాజ్‌వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పోచంపల్లి-బీబీ నగర్ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ దాటింది. ఫుల్ ట్యాంక్ లెవల్ సామర్థ్యం 513.45 మీటర్లు కాగా.. ప్రస్తుతం 514.75 మీటర్లు దాటింది. జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కూ వరదనీరు పోటెత్తుతోంది. హిమాయత్ సాగర్‌కు 1200 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం అక్కడి నీటిమట్టం 1761.20 అడుగులకు చేరింది.