తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా ఈసారి కూడా టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో ఉండగా.. మరోవైపు ఆశావహులు తమకు టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. అయితే దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సిట్టింగులకు వ్యతిరేకత ఉంది. ఈ ప్రాంతాల్లో మార్పులపై కేసీఆర్ ఫోకస్ చేసినట్టు తెలిసిందే.
ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలో పార్టీ విధానాలకు, తనకు వ్యతిరేకంగా కొంతమంది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు, కుట్రలు అన్నీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు తెలుసని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సీఎం ఆదేశాలతో వాటికి త్వరలోనే ముగింపు పలుకుతానన్నారు. సొంత పార్టీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా… వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగానే పోటీ చేసి.. హ్యాట్రిక్ విజయం సాధించి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందజేస్తానని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు.