దళితులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం మార్గదర్శకాలు మారనున్నాయి. సెకండ్ పేజ్ లో కొత్త గైడ్ లైన్స్ తీసుకురానున్న ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల అధికారులకు చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ పథకం పూర్తిగా పేదోళ్లకే అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇకమీదట అధికారుల కనుసన్నల్లోనే జాబితా రూపొందనుంది.
దళిత బంధు నిధులను అర్హత లేని వారికి, అధికార పార్టీ నేతలు కార్యకర్తలకి ఎక్కువగా ఇస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి విడత పథకం పంపిణీ కోసం నియోజకవర్గానికి 100 మంది ఎంపిక జాబితాలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రభావం అధికంగా కనిపించింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేల బంధువులు, అనుచరులు, టిఆర్ఎస్ కార్యకర్తలే ఎక్కువగా లబ్ధి పొందారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.