హైదరాబాద్ వాసులకు అలర్ట్. హైదరాబాదులోని న్యూ ఇయర్ ఈవెంట్ల నిర్వాహకులు కచ్చితంగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన ఆదివారం పేర్కొన్నారు. ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకొని పొందాలని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు.
ఈనెల 31 రాత్రి హోటల్స్, పబ్స్, క్లబ్స్ తదితరాలు అర్ధరాత్రి ఒంటిగంట వరకే పని చేయాలని ఆయన తెలిపారు. సీసీ కెమెరాలు అవసరమైన స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, తగినంత పార్కింగ్ స్థలం ఖచ్చితం అని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో డీజే తదితరాలకు అనుమతి లేదు. కార్యక్రమం జరిగే ప్రాంతం బయటకు శబ్దం వినిపించకూడదు. దీన్ని అతిక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రంగా పరిగణిస్తారు. అసభ్య వస్త్రధారణ, అభ్యంతరకరమైన నృత్యాలకు తావుండకూడదు. మాదకద్రవ్యాల వినియోగానికి నిర్వాహకులు బాధ్యులవుతారని ఆనంద్ స్పష్టం చేశారు.