పథకాల గురించి అడిగితే ‘ఓ స్త్రీ రేపు రా’ కథ చెబుతున్నారంటూ తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ కీలక నేత నిరంజన్ రెడ్డి చురకలు అంటించారు. కాంగ్రెస్ నేతలకు ఎన్నికల ప్రచారంపై ఉన్న శ్రద్ధ పథకాల అమలుపై ఉండదా? అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
“సీఎం, మంత్రులను పథకాల గురించి అడిగితే దయ్యానికి భయపడి గోడల మీద రాసే ‘ఓ స్త్రీ రేపు రా’ కథను వినిపిస్తున్నారు. డిసెంబర్ 9 నుంచి రూ. 15వేల రైతు భరోసా అనే హామీ ఏమైంది? వారికి రూ. 500 బోనస్ వట్టి బోగస్ అని తేలిపోయింది. INC హామీలు నీటి మీది రాతలని ప్రజలకు తెలిసింది” అని పేర్కొన్నారు.
మా ప్రభుత్వంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వల సామర్థ్యానికి పెంచాం. పంటకు బోనస్ ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటే మరిచారు. యాసంగి పంటకు బోనస్ ఇస్తారో… లేదో చెప్పాలి. లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయని చెప్పి బోనస్ నిలిపివేస్తారా? 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాం వద్దకు వెళ్లనివ్వకుండా తాళాలు వేశారు. కేసీఆర్ పాలనలో అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం జరిగిందని వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహించారు.