తెలంగాణలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన సాగుతోంది. 8 వేల కోట్ల వ్యయంతో 460 కిలోమీటర్ల పొడవు గల జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు గడ్కరీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఇందులో 2 జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు. వీటితో పాటు 10 జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేస్తారని తెలంగాణ బీజేపీ నాయకులు వెల్లడించారు. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ కింద 7 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు వెల్లడించారు.
ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర రోడ్డు రవాాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీబీ పాటిల్ లు హాజరు అయ్యారు. అయితే ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ నినాదాలు చేశారు. వెంటనే కిషన్ రెడ్డి కల్పించుకుని ప్రశాంతంగా ఉండాలని కోరారు. ఇది పద్దతి కాదంటూ కార్యకర్తలను వారించారు. జై శ్రీరామ్ నినాదాల వల్ల కొంత సమయం ప్రశాంత్ రెడ్డి తన స్పీచ్ ను ఆపేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా చేతులతో వారించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని… ఇదేం పద్దతి అంటూ.. ఏమాత్రం గౌరవం ఉన్నా ఆపాలంటూ కోరారు.