ఖానాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే లక్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని స్త్రీ శిశు సంక్షేమ, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఏఎంకే పంక్షన్ హల్లో శనివారం ఏర్పాటు చేసిన ఖానాపూర్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడమ బొజ్జ పటేల్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ అంటే సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించే పార్టీ అని, గతంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, భూ పంపిణీ, ఉపాదిహామీ, తదితర అనేక ఫలాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. గ్రామాలు, మండలాలు, బూతుల వారీగా కార్యకర్తలంతా కలిసి సమీక్ష చేసుకోవాలన్నారు. ఏండ్ల నుంచి ఎన్నో ఒడుదొడుకులను ఓర్చుకొని పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు తగిలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్న ఇతర పార్టీల వారిని స్థానిక కార్యకర్తల సూచన మేరకే పార్టీలో చేర్చుకుంటామన్నారు.