రాహుల్ గాంధీ ఓబీసీల పరువు తీసేలా మాట్లాడారు – ఎంపీ లక్ష్మణ్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి ప్రధాని కావడం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఇష్టం లేదని అన్నారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. మోడీ సహా ఓబీసీలను కించపరిచేలా రాహుల్ మాట్లాడారని విమర్శించారు. ఓబీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని.. లేదంటే ఓబీసీలు రాహుల్ కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో భారతదేశాన్ని ప్రపంచ వేదికలపై నిలబెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఓబీసీల పరువు తీసేలా రాహుల్ గాంధీ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మణ్.