తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా రసమయి

-

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ రెండో సారి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సాంస్కృతిక సారథి చైర్మన్‌గా రసమయి మరో మూడేళ్ళు పదవిలో కొనసాగనున్నారు. తనను సాంస్కృతిక సారథి చైర్మన్‌గా పునర్నియామకం చేయడం పట్ల రసమయి, ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చేతుల మీదుగా తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, రసమయిని అభినందించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ఉద్యమంలో కష్టపడి పనిచేసిన సాంస్కృతిక కళాకారులను రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించి, వారికి ఉద్యోగాలిచ్చిందని అన్నారు. కోర్టు ఆదేశాలమేరకు అందరికీ సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక కళాకారుల పాత్ర మరువలేనిదనీ, స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాత్ర గొప్పదన్నారు. దేశానికే ఆదర్శంగా, రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి పథకాల సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు మరింతగా చేరేలా సాంస్కృతిక సారథి చైర్మన్ గా రెండోసారి నియామకమైన రసమయి కృషి చేయాలని, సీఎం ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news