తెలంగాణ హైకోర్టుకు మే 1 నుంచి వేసవి సెలవులు. జూన్ 2వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అత్యవసర కేసుల నిమిత్తం ప్రతి గురువారం ఒక డివిజన్ బెంచ్, ఒక సింగిల్ బెంచ్ పనిచేస్తాయని రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి మంగళవారం పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని, వాటిపై గురువారం విచారణ ఉంటుందని పేర్కొన్నారు.
మొదటి వేసవి సెలవుల ప్రత్యేక కోర్టులో జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ ఎ.సంతోష్‌రెడ్డిల ధర్మాసనంతోపాటు జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ సింగిల్ బెంచ్, 2వ వారంలో జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ కె.శరత్‌ల ధర్మాసనం, జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ సింగిల్ బెంచ్, 3వ వారంలో జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ పుల్లా కార్తీక్‌లతో కూడిన ధర్మాసనం, జస్టిస్ కె.శరత్ సింగిల్ బెంచ్, 4వ వారంలో జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పుల్లా కార్తీక్‌ల ధర్మాసనం, జస్టిస్ సాంబశివరావు నాయుడు సింగిల్ బెంచ్, చివరి వారంలో జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం, జస్టిస్ ఎన్.వి.శ్రావణ్‌కుమార్ సింగిల్ బెంచ్ కేసుల విచారణ చేపడతాయని పేర్కొన్నారు.
హెబియస్ కార్పస్, ముందస్తు బెయిలు, కింది కోర్టులు తిరస్కరించిన బెయిలు, కూల్చివేత, ఖాళీ చేయించడం వంటి అత్యవసర కేసుల విచారణ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. విధానపరమైన, పరిపాలనాపరమైన నిర్ణయాలకు సంబంధించిన పిటిషన్‌లపై విచారణ ఉండదని పేర్కొన్నారు.