పని విభజన ఓకే…కానీ క్లారిటీ మిస్ అయిందా ఠాగూర్…!

టీ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్లకు పని విభజన చేయడంలో ఠాగూర్ ఆలోచన ఏంటో కానీ..పార్టీలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంఛార్జీలు ఏం చేయాలి…? వాళ్ళ పరిధి ఏంటన్న దానిపై నాయకులకు క్లారిటీ లేకుండా పోయింది. అందరి సేవలు వాడాల్సిందే… పార్టీని బలోపేతం చేయడానికి అన్ని రకాల ఎత్తుగడలు అవలంబించాల్సిందేనని క్లారిటీ ఇచ్చారు టీ కాంగ్రెస్ ఇంచార్జ్‌ ఠాగూర్‌.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల కు పని విభజన చేసేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. అయితే పార్టీ ఇచ్చిన కార్యచరణ అమలు కోసం పని చేస్తారా..? లేదంటే…వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఇంఛార్జీలు ఏదైనా చేయొచ్చా అనేది అసలు ప్రశ్న. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగించిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇక్కడఉన్న నాయకుల తో పని చేయించాలా…స్థానిక నాయకత్వ మార్పులు చేసుకోవచ్చా…? కొత్తగా ఇప్పుడు బాధ్యతలు అప్పగిస్తే ఎవరికి వారు.. తమ గ్రూప్ లను పెంచుకునే అవకాశం కూడా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.

ఇంఛార్జీలు పార్టీ కంటే…సొంత టీంని పెంచుకునే పనిలో పడితే… అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరికి సొంత నియోజకవర్గం లోనే పట్టు అంతంత మాత్రం. అలాంటిది…పొరుగు నియోజకవర్గాల్లో దృష్టి పెడితే…ఉన్న నియోజకవర్గం పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. వాళ్ళ సొంత నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే బెటరనే వాదన కూడా ఉంది. ఇప్పటికే బాధ్యతలపై కొందరు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వచ్చినప్పుడు తప్పా… ఎప్పుడూ కనిపించని అజారుద్దీన్‌కి అనుబంధ సంఘాల బాధ్యత అప్పగించారు. అయితే ఆయన ఎంతవరకు పనిచేస్తారన్నది కూడా అనుమానమే అంటున్నారు. మొత్తానికి పనివిభజన వల్ల హస్తం ఎంతవరకు పుంజుకుంటుందన్నది చూడాలి.