సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనాస్థలికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. సహాయక చర్యలను పరిశీలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. అగ్నిప్రమాద ఘటనలో ఇప్పటివరకు ఎవరూ గాయపడలేదని తెలిపారు. భవనంపైన చిక్కుకున్న ఐదుగురిని సిబ్బంది సురక్షితంగా కాపాడారన్నారు. అయితే, దుకాణం లోపల ఇద్దరు చిక్కుకుని ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
మూడు గంటలుగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారని.. మరో రెండు గంటల్లో మంటలు పూర్తిగా ఆర్పివేస్తారని మంత్రి తలసాని చెప్పారు. చుట్ట పక్కల ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇళ్ల మధ్య గోదాంలు, పరిశ్రమలు ఉండటం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. వీటి వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేస్తున్నారన్న మంత్రి.. ప్రభుత్వం చర్యలు చేపడితే 25వేల దుకాణాలు ఖాళీ చేయించాల్సి ఉంటుందన్నారు. అనుమతులు లేని పరిశ్రమలు, గోదాంలపై కఠిన చర్యలు తీసుకుంటామని తలసాని హెచ్చరించారు.