తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున.. ఈ వర్షాలు మరో వారంపాటు కొనసాగే అవకాశం ఉన్నందున.. ఆ తర్వాత సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వచ్చే నెల రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12తో ముగిసిన విషయం తెలిసిందే. 6 నెలల గడువు ప్రకారం…. ఆగస్టు 11లోపు ఉభయసభలు తిరిగి సమావేశంకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల రెండో వారంలో అసెంబ్లీ, కౌన్సిల్‌ను సమావేశ పరుస్తారని సమాచారం. వివిధ అంశాలు, రాష్ట్రంలో పరిస్థితులు..సమావేశాల్లో చర్చకు రానున్నాయి. కొన్ని బిల్లులను భారాస సర్కార్ తీసుకొచ్చే అవకాశం ఉంది. నవంబర్ లేదా డిసెంబర్‌లో…..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలకు ముందు ఈ సమావేశాలే చివరిసమావేశాలు అయ్యే అవకాశం ఉంది. సహజంగానే ఎన్నికల ప్రభావం సమావేశాలపై ఉండనుంది.