నేడే తెలంగాణ కేబినెట్ భేటీ.. ఎజెండాలో 36 అంశాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే మంత్రిమండలి సమావేశంలో 36 అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ మండలి ఎజెండాను ఖరారు చేశారు. మంత్రిమండలిలో చర్చించాల్సిన అంశాలపై ఆయన బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, తమ కార్యాలయ అధికారులతో సమావేశమై చర్చించారు.

అదనపు ఆదాయవనరుల సమీకరణకు సంబంధించిన కీలక నిర్ణయాలతో పాటు అనాథలకు భరోసా, 57 ఏళ్ల వారికి పింఛన్లు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల, పలు ఉత్తర్వులకు ఆమోదం వంటి తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. మునుగోడులో ఉప ఎన్నికల వేడి మొదలుకావడంతో మంత్రిమండలిలో అధికారిక ఎజెండా ముగింపు అనంతరం దానిపైనా సీఎం చర్చించే అవకాశం ఉంది.

ఇటీవల హత్యాయత్నానికి గురైన పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, తెరాస నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి మనోధైర్యంతో, నిబ్బరంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. ఆయనకు తాము, తెరాస పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం పిలుపు మేరకు జీవన్‌రెడ్డి బుధవారం ప్రగతి భవన్‌కు వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయన హత్యాయత్నం ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. తన హత్యాయత్నం వెనక పెద్ద కుట్ర ఉందని జీవన్‌రెడ్డి సీఎంకు చెప్పగా.. ఆయన స్పందించి, డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫోన్‌ చేసి, ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించారు.