రాష్ట్రంలోని నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా మహిళలకు ఇది తీపి కబురే. ఎందుకంటే.. సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు అత్యధికంగా మహిళలకే రిజర్వు అయ్యాయి. గురువారం 4,006 పోస్టులకు సమగ్ర ప్రకటన వెలువడగా.. అందులో 3,012 (75 శాతం) అతివలకే దక్కనున్నాయి. జనరల్ అభ్యర్థుల కోటా కింద కేవలం 994 (25 శాతం) పోస్టులు మాత్రమే దక్కాయి. బాలికలు, మహిళా గురుకులాల్లో పోస్టులన్నీ మహిళలతో భర్తీ చేయాలన్న సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వ నిబంధనలున్నాయి.
రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,231 పోస్టులకు ఈనెల 5న గురుకుల నియామక బోర్డు ఒకేసారి తొమ్మిది ఉద్యోగ ప్రకటనలు వెలువరించింది. ఇందులో ఎనిమిది ప్రకటనలకు ఇప్పటికే సమగ్ర ప్రకటనలు ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు ఈనెల 28 నుంచి మే 27 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. తొలుత టీజీటీ కింద 4,020 పోస్టులు ఉంటాయని ప్రకటించినప్పటికీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలోని 14 పోస్టులకు సర్వీసు నిబంధనలు రాకపోవడంతో తాజా ప్రకటనలో చేర్చలేదు.