Home వార్తలు Telangana - తెలంగాణ మునుగోడులో తెరాస నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు: జగదీశ్‌రెడ్డి

మునుగోడులో తెరాస నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు: జగదీశ్‌రెడ్డి

మునుగోడులో తెరాస నాయకులందరూ ఐక్యంగానే ఉన్నారని, అసంతృప్తులు, అసమ్మతులు లేవని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి  తెలిపారు. సీఎం కేసీఆర్‌ మునుగోడు టికెట్‌ ఎవరికి ఇచ్చినా గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అభ్యర్థిని సీఎం కేసీఆర్‌ నిర్ణయిస్తారని, ప్రస్తుతానికి తెరాస పార్టీ, కారు గుర్తే తమ అభ్యర్థి అన్నారు.

ఉప ఎన్నికల్లో తెరాసను గెలిపించేందుకు ప్రజలు కోరుకుంటున్నారని, సుమారు 50వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక రావాల్సిన అవసరమేంటో ప్రజలకు వివరిస్తామన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా విఫలమయ్యారని, తన స్వార్థం, కుటుంబ అభివృద్ధి కోసమే ఉప ఎన్నికలు తీసుకొచ్చారని మంత్రి ధ్వజమెత్తారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని, 2018లో తెరాస గెలవనందుకు నష్టపోయామన్న భావన ప్రజల్లో ఉందన్నారు. ప్రగతిభవన్‌లో మునుగోడు ప్రజాప్రతినిధులతో సమావేశమైన తర్వాత జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

“మునుగోడులో తెరాస నాయకులందరూ ఐక్యంగానే ఉన్నారు. తెరాస అభ్యర్థిని గెలిపించేందుకు నాయకులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం తెరాస, కారు గుర్తే మా అభ్యర్థి. మునుగోడులో తెరాసను గెలిపించాలని ప్రజలు కూడా భావిస్తున్నారు. 50 వేల మెజార్టీతో తెరాస గెలుస్తుంది. ఎమ్మెల్యేగా రాజగోపాల్‌రెడ్డి విఫలమయ్యారు. రాజగోపాల్‌రెడ్డి స్వార్థం కోసమే ఈ ఉపఎన్నిక తెచ్చారు. మునుగోడు తెరాసలో అసంతృప్తులు లేరు.” – జగదీశ్​రెడ్డి, మంత్రి