తెలంగాణలో మే రెండో వారం నుంచి వర్షాలు ఊపందుకున్నాయి. వానలతో రాష్ట్రాన్ని వరణుడు వణికిస్తున్నాడు. మొన్నటిదాక ఎండలతో ఠారెత్తించిన సూర్యుడు ఇప్పుడు కాస్త చల్లబడ్డాడు. జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో వారం రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపారు.
ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 22వ తేదీ వరకు ‘పసుపు ’రంగు హెచ్చరికలు జారీ చేశారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఒక్కసారిగా కుండపోత వర్షాలు సంభవిస్తుంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తీవ్రమైన ఎండలు లేనప్పటికీ ఏప్రిల్‌లో నమోదైన రికార్డుస్థాయి ఎండలు ఇప్పుడు ప్రభావం చూపిస్తున్నాయని వివరించారు. మే 31న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది.