ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ ఆకర్షించే తెలంగాణ ఆర్టీసీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బస్టాండుల్లో తాగునీరు సదుపాయంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సజ్జనార్ సూచించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్యాన్లు, కూలర్లు, బెంచీలను ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో ప్రయాణికులకు ఏర్పాట్లు, సంస్థలోని ఇతర అంశాలపై హైదరాబాద్‌లోని బస్‌భవన్ నుంచి ఆర్ఎంలు, డీఎంలు, ఉన్నతాధికారులతో ఎండీ సజ్జనార్ ఆన్లైన్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
సాంకేతికతను ఉపయోగించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. వేసవి సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ ఉండవచ్చని చెప్పారు. దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వివరించారు. మార్చి నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండడంతో రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైతే అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించారు