రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, శాసనసభ అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలి. గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగులో ఉన్న జవాబులను వెంటనే పంపించాలి.
సభలో గౌరవ సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సభకు, గౌరవ సభ్యులకు అందించాలి. సభకు సమర్పించే సమాధాన పత్రాలను ముందుగానే పంపినట్లయితే వాటిని సభ్యులు చదువుకొని సభలో మాట్లాడడానికి, చర్చించడానికి అవకాశం ఉంటుంది. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ బాషలలో ముద్రించి ముందస్తుగా సభ్యులకు అందించితే వారు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుంది. శాఖకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలి. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలి. ప్రతి శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమించాలి. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకోవాలి. సభ లోపలితో పాటుగా, పరిసరాలలో కూడా శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే చర్చలు బాగా జరుగుతాయి. గౌరవ సభ్యులుసమయానికి సజావుగా శాసనసభకు చేరుకోవడానికి రహదారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలి అని సూచించారు స్పీకర్.