భానుడి భగభగలతో తెలంగాణ అట్టుడికిపోతోంది. సెగలు కక్కుతున్న ఎండలతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కరి అయిపోతున్నారు. ఉదయం 9 దాటిందంటే బయటకు వెళ్లడానికి గజగజ వణుకుతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వానలు అక్కడక్కడా పడతాయని, గురువారం పొడి వాతావరణం నెలకొంటుందని ప్రకటించింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, వికారాబాద్, మెదక్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. మొన్నటి దాకా ఎండలు మండిపోయి ఇప్పుడు వాతావరణం మారిపోవడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.