దేశంలో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గడానికి కారణాలు ఏంటో చెప్పారు సిపిఐ జాతీయ నేత నారాయణ. దేశంలో ప్రాంతీయవాదం, మతతత్వం, డబ్బు ప్రభావం పెరిగిందని.. పైగా కమ్యూనిస్టు పార్టీ చీలిక కూడా ప్రాంతీయ పార్టీలకు ఊతమిచ్చిందన్నారు. కమ్యూనిస్టుల బలహీనత కారణంగానే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చి బలోపేతం అయ్యాయి అన్నారు నారాయణ. లేదంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టు పార్టీ నిలబడేది అన్నారు.
కమ్యూనిస్టుల పునరేకికరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలు వ్యాపారం అయ్యాయి కనుక ఒకరిద్దరు కమ్యూనిస్టులు పార్టీ వీడి ఉండొచ్చు కానీ.. ప్రజా ఉద్యమాల నిర్మాణంలో కమ్యూనిస్టులు నేటికీ బలంగానే ఉన్నారని తెలిపారు. ఒకప్పుడు 60 కి పైగా సీట్లతో పార్లమెంటులో బలంగా ఉన్నామని గుర్తు చేసుకున్నారు. ఇక రాజ్యాంగ వ్యవస్థలను రక్షించేలా పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు నారాయణ. వందేళ్ల సిపిఐ ప్రయాణంలో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదు చేపడతామన్నారు. పది లక్షల సభ్యత్వాలు చేపట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు.