నల్లమలలో ఎన్ని పులులు ఉన్నాయో తెలుసా..?

-

తెలంగాణలో పులుల సంఖ్య పెరిగిందట. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతమైన అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు (ఏటీఆర్‌)లో బాగా కనిపిస్తున్నాయంట. ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌-2018’లో రాష్ట్రవ్యాప్తంగా 26 పులులు (అమ్రాబాద్‌లో 16, కవ్వాల్‌లో 10) ఉన్నట్లు వెల్లడైంది. ఈ నివేదికను 2019 జులై 29న ‘గ్లోబల్‌ టైగర్‌ డే’ సందర్భంగా ప్రధాని మోదీ విడుదల చేశారు.


కానీ ఇప్పుడు ఒక్క ఏటీఆర్‌లోనే 24 పులులు కెమెరా కంటికి చిక్కాయి. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు (కేటీఆర్‌)లో 10-12 వరకు పులుల్ని గుర్తించారు. పులుల అంచనా లెక్కల్ని రెండు నెలల క్రితమే వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు పంపించారు.
అప్పుడు ఏటీఆర్‌లో 19 పులులున్నాయి. తాజాగా మరో అయిదు పులులు కన్పించడంతో ఈ గణాంకాల్ని పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ పులుల ప్రాధికార సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ)కు లేఖ రాయాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 24 పులుల చిత్రాలను జత చేస్తున్నారు.


సంతానాన్ని ఇచ్చే ఆడపులుల సంఖ్య పెరుగుతోందని, ఇది శుభపరిణామమని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు అధికారులు చెబుతున్నారు. ప్రతి నాలుగేళ్లకోసారి పులుల లెక్కల్ని వెల్లడిస్తారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో ఈసారి ఏడాది ముందుగానే ప్రకటించనున్నారు. ఆగస్టు 15తో అమృత మహోత్సవాలు ముగియనున్న నేపథ్యంలో ఈలోగానే ప్రధాని మోదీ ‘ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌-2022’ను వెల్లడించనున్నారు.

‘‘అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో ఏప్రిల్‌ వరకు ఉన్న డేటా పంపించాం. 19 పులులు కనిపించాయి. తాజాగా 24 పులుల చిత్రాలు లభించాయి. కెమెరాలకు చిక్కనివి, అటవీ సిబ్బంది వెళ్లలేని దట్టమైన అటవీ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటే 30 వరకు పులులు ఉంటాయి’’అని అమ్రాబాద్‌ ఎఫ్‌డీఓ రోహిత్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news