TSPSC పేపర్ లీక్ కేసు.. చేతులు మారిన రూ.33.4 లక్షలు

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సిట్, ఈడీ అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. ఇప్పటికే 19 మందిని అరెస్టు చేసిన సిట్ వారిని విచారిస్తూ కీలక విషయాలు తెలుసుకుంది. అయితే ఈ లీకేజీ వ్యవహారంలో నిందితులకు రూ.33.4 లక్షలు అందినట్లు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో సిట్‌ అధికారులు గుర్తించారు. కొందరు నిందితులు నగదు తీసుకోగా..మరికొందరు బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయించుకున్నట్లు తేలింది.

ఇందులో ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్‌కుమార్‌కు రూ.16 లక్షలు ముట్టినట్లు వెల్లడైంది. ఏఈ సివిల్‌ ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్‌కుమార్‌.. గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు రేణుకారాథోడ్‌, ఆమె భర్త డాక్యాకు ఇచ్చేందుకు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. రేణుక తన సోదరుడు కేతావత్‌ రాజేశ్వర్‌ కోసం దీన్ని కొనుగోలు చేసింది. తర్వాత కేతావత్‌ రాజేశ్వర్‌, డాక్యాలు ఆ ప్రశ్నపత్రాన్ని అయిదుగురికి రూ.10 లక్షల చొప్పున విక్రయానికి బేరం పెట్టారు. కానీ అందరూ అంత మొత్తం ఇవ్వలేదు. నీలేశ్‌నాయక్‌ రూ.4.95 లక్షలు, గోపాల్‌నాయక్‌ రూ.8 లక్షలు, ప్రశాంత్‌రెడ్డి రూ.7.5 లక్షలు, రాజేంద్రకుమార్‌ రూ.5 లక్షలు, వెంకటజనార్దన్‌ రూ.1.95 లక్షలు ఇచ్చారు. మొత్తం రూ.27.4 లక్షలు వచ్చాయి. వెంకటజనార్దన్‌ నగదును డాక్యా బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. మిగిలిన వారు నగదు ఇచ్చారు. ఇందులో రూ.10 లక్షలను ప్రవీణ్‌కుమార్‌కు ఇవ్వగా.. వారికి రూ.17.4 లక్షలు మిగిలాయి.

మరోవైపు డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్‌కుమార్‌.. సాయిలౌకిక్‌, సాయిసుస్మిత దంపతులకు (ఖమ్మం) అమ్మాడు. ఇందుకోసం వారిద్దరు ప్రవీణ్‌కుమార్‌కు రూ.6 లక్షలు ముట్టజెప్పారు. అలా ప్రవీణ్‌కుమార్‌కు రూ.16 లక్షలు, డాక్యా, రాజేశ్వర్‌లకు రూ.17.4 లక్షలు కలిపి ఈ మొత్తం వ్యవహారంలో రూ.33.4 లక్షలు చేతులు మారాయని కోర్టుకు సిట్‌ నివేదించింది.

Read more RELATED
Recommended to you

Latest news