టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ ఈరోజు విచారణకు హాజరుకావాలని 160సీఆర్పీసీ కింద సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అనితా రామచంద్రన్ సిట్ కార్యాలయానికి చేరుకొని విచారణకు హాజరయ్యారు. ఆమె వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. దాదాపు అరగంట పాటు జరిపిన విచారణలో సిట్ అధికారులు కీలక ప్రశ్నలు అడిగారు.
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్.. అనితా రామచంద్రన్ వద్ద పీఏగా పని చేశారు. దీంతో ప్రవీణ్ గురించి అనితా రామచంద్రన్‌ను సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాల తయారీ, భద్రత, ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన వివరాలను సైతం సిట్ అడిగనట్లు సమాచారం.
గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి వందకు పైగా మార్కులు సాధించిన వారిలో ఇప్పటివరకు వంద మందిని సిట్ అధికారులు విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. మిగిలిన 21 మందిని రెండు మూడు రోజుల్లో ప్రశ్నించనున్నారు. ఇప్పటివరకు ప్రశ్నపత్రం లీక్ చేసిన ప్రవీణ్, రాజశేఖర్, వాటి ద్వారా పరీక్షలు రాసిన వారు సహా మొత్తం 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.