మరో ముగ్గురు భరతమాత ముద్దు బిడ్డలకు సముచిత గౌరవం దక్కిందని మాజీ ఉపరాష్ట్రపతి వెెంకయ్యనాయుడు అన్నారు. భారత పూర్వ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించటం అత్యంత సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. రైతుల పక్షపాతి అయిన చరణ్ సింగ్ స్వచ్ఛమైన నేత అని కొనియాడారు. అన్నదాతలు, రైతు కూలీల సంక్షేమానికి జీవితాంతం పరిశ్రమించిన నిత్య కృషీవలుడని అన్నారు. భూ సంస్కరణలకు పాటుబడిన రైతు నేత అని, రైతులు, రైతు కూలీల సంక్షేమాన్ని కాంక్షిస్తూ మంచి పుస్తకాలను రాశారని ట్వీట్ చేశారు.
“దేశంలో ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి, భారత్ ను అభివృద్ధి పథం వైపు పరుగులు తీయించిన గొప్ప దార్శనికుడు పీవీ నరసింహారావు. బహు భాషా కోవిదుడు అయిన పీవీ మౌనంగానే సంస్కరణలను చేపట్టి దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టారు. ఆర్థిక సంస్కరణలతో నూతన దశ దిశ కల్పించారు. వారు తెలుగు వారవటం మనందరికీ గర్వకారణం. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కోట్ల మంది ఆకలి కోసం ఆయన పెద్ద పోరాటమే చేశారు. భారత వ్యవసాయ రంగంలో దిగుబడిని ఇబ్బడి ముబ్బడిగా పెంచి, స్వయం సమృద్ధిని సాధించడానికి ఆయన చేసిన కృషి భరతజాతి ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది.” – వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి