గొల్ల, కురుమలకి మేలు జరగాలంటే బీజేపీకి ఓటు వేయండి : ఈటల రాజేందర్

-

గొల్ల, కురుమలకి మేలు జరగాలంటే బీజేపీకి ఓటు వేయండి అని కోరారు మల్కాజ్ గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి  ఈటల రాజేందర్. ఇవాళ పీర్జాది గూడ, కురుమ సంఘం వాసులతో ఆత్మీయసమ్మేళనంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్.  ఈ ఆత్మీయ సమ్మేళనంలో మీకు నా గురించి ఎన్ని విషయాలు తెలుసో నాకు అర్థమయ్యింది. మీ గౌరవాన్ని, మీ నమ్మకాన్ని నిలబెట్టేలా పని చేస్తానని మాట ఇస్తున్నాను
అధికారంలో ఉంటే అణగారిన వర్గాలకు చేతనయినంత సాయం చేసేవాడిని. ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో హాస్టల్ పిల్లలకు కడుపు నిండా సన్నబియ్యం అన్నం పెట్టించడానికి కృషి చేశాను. అన్ని కులాల వారికి నగరంలో వసతి కల్పించేలా, 78 కులాలకు వసతి గృహాలు కట్టించాను. గొల్ల, కురుమ వర్గాలకు కలిపి గొర్ల స్కీం పెట్టాము.

గతంలో లక్ష రూపాయల అప్పుకి, 20 వేలు మాఫీ చేసి, వడ్డీ ఫ్రీ ఉండేది. అప్పట్లో ప్రభుత్వమే గ్యారెంటీ ఉండాలని పట్టుబట్టాము. జీవాలను కాపాడుకోవడం అంత సులువు కాదు. ఎండకు, వానకు, చలికి షెడ్డులు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. గత ప్రభుత్వంలో గొల్ల, కురుమల పేరిట బ్రోకర్లకు డబ్బు చేరింది. అందుకే బ్రోకర్లకు చేరకుండా నేరుగా లబ్దిదారులకే అందేలా చేయాలని కోరుతున్నాను

కొన్ని వర్గాలకు ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉంది. నేను 2004లో ఎమ్మెల్యే అయ్యాను. పద్మశాలీలు, నేత కార్మికుల సమస్యల గురించి మాట్లాడేటప్పుడు ఒక పద్మశాలీ వ్యక్తి నన్ను మెచ్చుకున్నారు. నేను ఒక కులానికి సంబంధించిన వాడిని కాదని, అన్ని కులాల వాడినని చెప్పాను. ఈ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఏనాడూ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవాడు.

నేను తెలంగాణ మట్టి బిడ్డను. నన్ను కొందరు నువ్వెక్కడ నుండి వచ్చావని అడుగుతున్నారు. 14 ఏళ్లుగా ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ముగ్గురు ముఖ్యమంత్రులతో కొట్లాడినా. రాజశేఖర్ రెడ్డి, రోశయ్యలతో పాటు మంత్రిగా ఉన్న కాలంలో కూడా కేసీఆర్‌తో కొన్ని సమస్యలపై కొట్లాడవలసి వచ్చింది.చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు, డబ్బులతో వార్తలు రాయించుకునే నాయకులను నిలువరించగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంది

కేసీఆర్ ఆనాడు ఇతర పార్టీల వారిని తమ పార్టీలోకి ప్రలోభపెట్టి చేర్పించుకునేవాడు. ఎన్నికల సమయంలో ఒకపార్టీ పేరుతో గెలిచిన వాడు మరొక పార్టీలోకి వెళిపోతున్నారు. నేను ఎక్కడ తిరిగినా ప్రజలు ఆదరిస్తున్నారు. బిడ్డా నువ్వు ఎండల్లో తిరగకు. నిన్ను గెలిపించుకునే బాధ్యత మదని భరోసా ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారునిగా నన్ను గుర్తిస్తున్నారు. నీకు అన్యాయం జరిగిందని బాధపడుతున్నారు. నువ్వు పార్లమెంటుకు ఖచ్చితంగా పోతావని హామీ ఇస్తున్నారు.

మల్కాజ్‌గిరి పార్లమెంట్ బాగుపడాలంటే ఐటీ పరిశ్రమ, రైల్వేలైన్లు, ఇండస్ట్రియల్ కారిడార్ వంటివన్నీ రావాలని నేను అన్ని రకాలుగా ప్రయత్నిస్తానని మాట ఇస్తున్నాను.ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తగని మాటలు మాట్లాడుతున్నాడు. మానవబాంబునవుతా, పేగులు మెళ్లో వేసుకుంటా, తొక్కి నార తీస్తా అంటూ చెత్త మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజలు నీకు అధికారం ఎందుకిచ్చారు. ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం పెన్షన్లపై పెడతానన్నాడు, పెట్టలేదు.
ప్రతీ మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలిస్తామని, వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు పెంచుతామని ప్రజలను ఆశ పెట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా ఏదీ నెరవేర్చలేదు. ఆడపిల్ల వివాహానికి కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తానని కూడా చెప్పాడు. అది ఒక్కరికి కూడా ఇంకా చేరలేదు.

రైతులకు 15 వేలు రైతుబంధు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ ఎవ్వరికీ రాలేదు. గతంలో కేసీఆర్ ఇచ్చిన 10 వేల రూపాయలు కూడా ఇవ్వడం లేదు. జీరో కరెంటుబిల్లు కూడా రావడం లేదు. కేసీఆర్ చిప్ప చేతికి ఇచ్చాడని ప్రజలకు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఖజానా ఖాళీ అయ్యిందని, తాను ప్రజలకేమీ చెయ్యలేనని చెప్పినట్లే.. కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీల వారు ఓటర్లను డబ్బు, మద్యంతో ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈటల రాజేందర్ ఒక బ్రాండు. డబ్బులిచ్చి, మద్యం ఇచ్చి గెలవడు. మల్కాజ్‌గిరి ప్రజలు ఇప్పటికే నేను వారి ఎంపీనని నిర్ణయించుకున్నారు. ముందుగానే శుభాకాంక్షలు చెప్తున్నారు. మీరందరూ పట్టు పడితే మనకు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version