నేడే చంద్రగ్రహణం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలన్నీ మూసివేయనున్నారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహ చార్యులు తెలిపారు. ఇవాళ ఉదయం మూడు గంటలకు ఆలయాన్ని తెరిచి నిత్య కైంకర్యములు నిర్వహించారు. ఈ కైంకర్యాల అనంతరం ఉదయం 8.15 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని తెలిపారు. మళ్లీ చంద్రగ్రహణం ముగిసిన తరవాత రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ పూజలు నిర్వహించి, రాత్రి పది గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని చెప్పారు.
మరుసటి రోజు ఉదయం యథాప్రకారం ఆలయాన్ని తెరవడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయడంతో స్వామి వారి దర్శనాలు, సత్యనారాయణ వ్రతాలు, వాహనపూజలు, నిత్య కైంకర్యాలు, స్వామి వారి కల్యాణం, బ్రహ్మోత్సవం, ఊరేగింపు సేవలు రద్దు చేశారు. ఈ విషయాన్ని భక్తులు అందరూ గ్రహించాలని కోరారు.
యాదాద్రితో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాలను ఇవాళ ఉదయం నుంచి మూసివేయనున్నారు. తిరిగి బుధవారం ఉదయం నుంచే భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు.