దెయ్యాలు ఉన్నాయని..కొందరు బలంగా నమ్ముతారు.. మరికొందరు అంతా ట్రాష్ అని కొట్టిపడేస్తారు. భయానికి, భక్తికి మధ్య జరిగే ఓ సంఘర్షణే.. ఆత్మలు, పాపాలు, దెయ్యాలు అని చెప్పుకోవచ్చు. అయితే.. ఇప్పుడు చెప్పుకోబోయో ఈ పది ప్రదేశాలు ప్రపంచంలోనే అత్యంత భయానకరమైనవట. నైట్ కాదు.. డే టైమ్‌లోనే వీటిని చూసేందుకు జనాలు వణికిపోతారు.. అంత ఘోరంగా ఉంటాయట.. ఇంట్రస్ట్ ఉంటే మీరు ఓ సారి వెళ్లండి.. ఇంతకీ అవేంటంటే..!
సింగపూర్‌లోని బిషన్ MRT స్టేషన్.. బి షైవ్ టెంగ్ అనే స్మశానవాటికలో ఇది నిర్మించబడింది. ఈ స్టేషన్ 1987లో ప్రారంభించారు.. అప్పటి నుంచి ఇక్కడ దెయ్యాల కథలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయ్. కొందరు మహిళలు చేతుల్లేకుండా.. మరి కొందరు తలల్లేకుండా కన్పించారని అక్కడికి వచ్చే ప్రజలు చెప్తారు..రైల్వే స్టేషన్ పైకప్పుపై నుంచి ఎవరో వెళ్తున్న శబ్దాలు అత్యంత భయానకంగా ఉంటాయని అక్కడి వారు అంటుంటారు.
రొమేనియాకు చెందిన లులియా హాస్‌డో హౌస్ కూడా భయంకరమైన ప్రదేశమే.. తన కుమార్తె మరణించిన తర్వాత.. లులియా అనే అమ్మాయి తండ్రి ఆమె జ్ఞాపకార్థం ఈ భవనాన్ని నిర్మించాడు. ఇక్కడ కూతురి ఆత్మతో కూడా మాట్లాడేవాడని చెప్పుకుంటారు. ఈ భవనం రొమేనియాలో అత్యంత భయంకరమైన ప్రదేశమని స్ధానికులు అంటుంటారు.
అమెరికాలోని లూసియానాలో, ‘ది మైర్ట్‌లెస్ సెయింట్ ఫ్రాన్సిస్‌విల్లే’ మోస్ట్ హాంటెడ్ ప్లేస్‌గా పరిగణించబడుతుంది. ఇక్కడ 10 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. భవనం వరండాలో ఇద్దరు చిన్నారుల ఆత్మలు కన్పించాయని చెప్పుకుంటారు.
జపాన్‌లోని ఫుజి పర్వతం దిగువన ఉన్న ఓకిఘరాలో ఉన్న అడవి ప్రపంచంలోనే ఆత్మహత్యల అడవిగా పేరుంది. ప్రతి సంవత్సరం వందలాది మంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారట. ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు ఇక్కడే ఉంటాయని అక్కడి స్థానికుల నమ్మకం.
ఫిలిప్పీన్స్‌లోని మనీలా ఫిల్మ్ సెంటర్. ఇది కూడా హాంటెడ్ ప్లేస్ అని అక్కడి స్థానికులు నమ్ముతారు. దీని నిర్మాణ సమయంలో చాలా మంది కార్మికులు చనిపోయారు. ఈ కూలీల ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయని అక్కడి వారు చెప్తుంటారు.
ఫ్రాన్స్‌లోని చాటేయు డి చాటేబ్రియన్ ప్యాలెస్. ఈ ప్యాలెస్‌లో అనుమానం రావడంతో ఓ మహిళకు ఆమె భర్త విషం ఇచ్చి హత్య చేశాడట. స్త్రీ ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది. ప్రజలు కూడా ఆమెను చాలాసార్లు చూశారట.
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఉన్న భన్‌గర్ కోట భారతదేశంలో అత్యంత ఆతిథ్యం పొందిన కోట. పగటిపూట ఇక్కడ పర్యాటకుల రద్దీ ఉంటుంది, కానీ సాయంత్రం ఇక్కడ నిశ్శబ్దం ఉంటుంది. ఇక్కడే ఏవేవో పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని బీచ్‌వర్త్‌లోని పిచ్చి ఆశ్రయంకూడా భయంకరమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ 1867 నుండి 1995 వరకు మానసిక ఆసుపత్రి ఉంది. 130 ఏళ్ల ఈ పిచ్చాసుపత్రి చరిత్రలో 9000 మంది రోగులు చనిపోయారు. వారి ఆత్మలు ఇక్కడ ఉన్నాయని అందరూ నమ్ముతారు. దీంతో, ప్రజలు ఇక్కడికి వెళ్లడానికి వణికిపోతారు.
మెక్సికో నుండి 17 మైళ్ల దూరంలో డాల్స్ ఐలాండ్ అనే ఒక ప్రత్యేకమైన ద్వీపం ఉంది.. ఈ ద్వీపంలో వేలాది విరిగిన బొమ్మలు వేలాడుతున్నాయి, ఇది చాలా భయానకంగా ఉంటుంది. ఈ ద్వీపంలో రాత్రిపూట ఎవరూ ఉండరు, అది ఎడారిగా ఉంటుంది. ఈ బొమ్మలలో ఆత్మలు నివసిస్తాయని ప్రజలు నమ్ముతారు, అందుకే ఇక్కడ రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయట.
రిన్హామ్ హాల్‌ను బ్రిటన్‌లో ఘోస్ట్ హాల్ అంటారు.. ఇందులో బ్రిటన్ తొలి ప్రధాని సోదరి డోర్తీ వాల్‌పూల్ ఆత్మ సంచరిస్తుందట. డోర్తి వాల్‌పూల్ ప్రేమ వ్యవహారం కారణంగా ఈ హాలులో బంధించబడిందని.. ఆ తర్వాత ఇక్కడే మరణించిందని అక్కడి వాళ్లు చెప్తారు.
సో.. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే.. ఈ ప్రదేశాలు మాత్రం భయంకరమైనవిగా గుర్తింపు పొందాయి. భయం.. లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగా చూపిస్తుంది.
-Triveni Buskarowthu