జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు విజయం లభించింది. తాజాగా చోటు చేసుకున్న ఎన్ కౌంటర్లో హిజ్బుల్ మజాహీదీన్ కు చెందిన కీలక ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని జైనాపోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషిద్ధ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ‘ఎ+’ కేటగిరీ ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఉగ్రవాది ఉన్నాడనే పక్క సమాచారంలో ఆర్మీ, పోలీసులు, సీఆర్ఫీఎఫ్ దళాలు ఉమ్మడిగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమయ్యాడు.
హతమైన ఉగ్రవాదిని షోపియాన్ నివాసి ఫిరోజ్ అహ్మద్ దార్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హత్యకు గురైన ఉగ్రవాది 2017 నుండి చురుకుగా ఉన్నాడు, 2018 డిసెంబర్‌లో జైనాపోరాలో మైనారిటీ గార్డ్‌పై దాడి చేయడంతో పాటు నలుగురు పోలీసు సిబ్బందిని హతమార్చిన కేసులు నిందితుడిగా ఉన్నాడు. అనేక ఉగ్రవాద నేర కేసులలో పాల్గొన్నాడు. కాశ్మీర్ లోని యువతను టెర్రరిజం వైపు మళ్లించడంలో అహ్మద్ దార్ కీలకంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.