ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న వెనుకబడిన సామాజిక వర్గం బీసీ వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీకారం చుట్టింది. బీసీ సామాజిక వర్గాల అభివృద్ధికి మరియు వారి జీవితాలను మెరుగుపరచుకునేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో బీసీ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం బీసీ నాయకులంతా తమతో కలిసి నడవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన బీసీ నాయకులకు వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో బుధవారం నాడు తాడేపల్లిలో వైఎస్సార్సీపీ బీసీ ఆత్మీయ సమావేశం జరిగింది. తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ బీసీల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చి అమలు చేస్తున్నారని వెల్లడించారు. సీఎం జగన్ దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేశారని కొనియాడారు. బీసీలు, ఇతర వెనుకబడిన వర్గాల రాజకీయ, ఆర్థిక సాధికారత కోసం పాటుపడుతున్న సీఎం జగన్ గొప్ప సంఘసంస్కర్తగా చరిత్రలో నిలిచిపోతారని తమ్మినేని తెలిపారు.
ఈ మూడున్నరేళ్లలో బీసీల కోసం వైసీపీ చేసింది ప్రారంభం మాత్రమేనని అన్నారు. సీఎం జగన్ దార్శనికతతో కూడిన నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీ నేతలపై ఉందని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ ఏం చేసినా ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచే విధంగా ఉంటుంది. రాష్ట్రం అంటే కేవలం ఏదో ఒక వర్గానికి మాత్రమే చెందినది కాదని, అన్ని వర్గాల వారూ కలిసి శ్రమిస్తేనే అభివృద్ధి అనేది సాధ్యపడుతుందని నమ్మే వ్యక్తి జగన్. అందుకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల కృషి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. సమాజంలోని ప్రతి పనిలోనూ బీసీ వర్గాల కృషి, శ్రమ ఉన్నాయని, వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. వారిని ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చేందుకు సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని విజయ్ సాయి రెడ్డి అన్నారు.