రాష్ట్రంలో టీడీపీ ఎదగాలని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, దీనికి అనుగుణంగా వేస్తున్న అడుగులు మాత్రం తీవ్ర వివాదానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గంలో రెండు వర్గాలు విడిపోయి.. పార్టీలో మాల సామాజిక వర్గాన్ని ఎదగనీయకుండా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో మాదిగ నేతల ఎఫెక్ట్‌తో టీడీపీ మాల నేతలు ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాల నేతలకు ప్రాధాన్యం ఉండేది. మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీకి కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించారు.
అదేవిధంగా జూపూడి ప్రభాకర్ కూడా పార్టీలో మంచి గుర్తింపు లభించింది. ఇక, ఈ సామాజిక వర్గానికే చెందిన పీతల సుజాతకు మంత్రి పదవి ఇచ్చారు. ఇలా మాల సామాజిక వర్గానికి చెందిన నేతలకు గుర్తింపు లభించింది. అయితే, పార్టీ ఓటమి తర్వాత మాత్రం పరిస్థితి భిన్నంగా తయారైంది. అంటే.. అప్పటికే చంద్రబాబు కోటరీగా మారిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎం.ఎస్ రాజు.. మాజీ మంత్రి జవహర్, వర్ల రామయ్య వంటివారు భజన చేయడం ప్రారంభించారు. దీంతో వీరి హవా ఎక్కువైంది. దీంతో ఇటీవల పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష పదవులు.. పార్టీ పొలిట్‌బ్యూరోలోనూ మాదిగ వర్గానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు.
అదే సమయంలో మాల సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులు.. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, మాజీ మంత్రి పీతల సుజాత వంటివారికి పదవులు దక్కలేదనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఇక, పార్టీలోనూ మాదిగలదే కీలక భూమికగా మారిందని, చంద్రబాబు సైతం వీరికే ప్రాధాన్యం ఇస్తున్నారని.. వారు చెప్పినట్టే నడుచుకుంటున్నారని అంటున్నారు. దీంతో టీడీపీలో మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అటు పైకి చెప్పుకోలేక.. ఇటు లోలోన దిగమింగలేక కూడా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.
ఇదిలావుంటే ఆదివారం విజయవాడలో మాదిగ నేతలు .. ఇటీవల రహస్యంగా సమావేశమై.. ఎస్సీ వర్గీకరణపై చర్చించడంతోపాటు దీనిపై చంద్రబాబుపైనా ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకు న్నారని సమాచారం. మరోవైపు మాదిగలు టీడీపీ వైపు, మాలలు వైసీపీ వైపు ఉన్నారని ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చినా పార్టీకి నష్టం లేదని మాదిగ నేతలు బాబుపై ఒత్తిడి తేవాలనుకుంటున్నారట.
మొత్తానికి టీడీపీలో మాదిగల ప్రభావం రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో మాలలు మాత్రం తమకు పార్టీలో ప్రాధాన్యం లేదని తీవ్ర అసహనంతో ఉన్నారు. మాల సంఘాలు సైతం మాల నాయకులను పార్టీ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. బాబు దీనిపై దృష్టి పెట్టకపోతే మాల ఓటు బ్యాంకు పార్టీకి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది.