ప్రతి మనిషికి గోత్రం, నక్షత్రం ఉంటాయి.. వీటిని ఎంతవరకు పట్టించుకుంటున్నారని మీ ఇష్టం.. జాతకాలకు పునాదులు మీ నక్షత్రలాలు, రాశులు. జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న 27 నక్షత్రాలకు దేవతలు, అధి దేవతలు ఉన్నట్టే ఆయా నక్షత్రాలకు వృక్షాలకు కూడా ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలలో ఆయా జన్మ నక్షత్రం ఉన్న వారు.. వారి నక్షత్రానికి అనుగుణంగా ఆయా మొక్కలను పెంచడం వల్ల వారి జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలను పెంచడం వల్ల మనకు మంచి జరగడంతోపాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. మీ నక్షత్రాలకు అనుగుణంగా ఏయే చెట్లను నాటాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అశ్విని నక్షత్రం వారు జీడి మామిడి చెట్టు లేదా విషముష్టి చెట్టును పెంచాలి. ఈ చెట్లను పెంచడం వల్ల చర్మ వ్యాధుల నుండి ఉపశమనం పొందడంతోపాటు సంతానాభివృద్ధి కూడా జరుగుతుంది.
భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును నాటి పెంచి పూజించడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తగ్గడమే కాకుండా జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.
కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు మేడి చెట్టును పెంచి పూజించడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టును పెంచి పూజించాలి. ఇలా చేయడం వల్ల కంటి సమస్యలు నయం అవుతాయి. అలాగే వారికి మంచి ప్రవర్తన, నడవడిక ఏర్పడుతుంది.
మృగశిర నక్షత్రం వారు మారేడు చెట్టును లేదా సండ్ర చెట్టును పెంచి పూజించాలి. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు తగ్గడంతోపాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
ఆరుద్ర నక్షత్రం వారు చింతచెట్టును పెంచి పూజించాలి. ఈ చెట్టును పూజించడం వల్ల విజయాలు సొంతమవుతాయి.
పునర్వసు నక్షత్రం వారు వెదురు లేదా గన్నేరు చెట్లను పెంచి సూజించడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు రావి చెట్టును లేదా పిప్పళ్ల చెట్టును నాటి పెంచి పూజించడం వల్ల కష్టాల నుండి బయటపడవచ్చు.
ఆశ్లేష నక్షత్రం వారు సంపంగి లేదా చంపక చెట్టును నాటి పెంచడం వల్ల సమస్యల నుండి సూనాయాసంగా బయటపడవచ్చు.
మఖ నక్షత్రం వారు మర్రి చెట్టును పెంచి పూజించాలి. ఇలా చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోవడమే కాకుండా ఆరోగ్యం కూడా సిద్దిస్తుంది.
పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారు మోదుగ చెట్టును నాటి పెంచి పూజించాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతోపాటు సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది.
ఉత్తర నక్షత్రం వారు జువ్వి చెట్టును పెంచడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు నయం అవుతాయి.
హస్త నక్షత్రం వారు సన్నజాజి లేదా కుంకుడు చెట్లను పెంచి పూజించడం వల్ల విపత్కర పరిస్థితుల్లో కూడా విజయం సాధిస్తారు.
చిత్త నక్షత్రంలో జన్మించిన వారు మారేడు లేదా తాటి చెట్టును పెంచి పూజించడం వల్ల మంచి పేరు తెచ్చుకుంటారు.
స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు మద్ది చెట్టును పెంచడం వల్ల ఉదర సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు.
విశాఖ నక్షత్ర జాతకులు వెలగ లేదా మొగలి చెట్టును పెంచి పూజించడం వల్ల ధైర్యంగా ఉండడంతోపాటు సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు.
అనురాధా నక్షత్రం వారు పొగడ చెట్టును పెంచడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి.
జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు కొబ్బరి చెట్టును పెంచడం వల్ల ఆత్మ విశ్వాసంతో పనులు నిర్వర్తిస్తారు.
మూల నక్షత్రం వారు వేగి చెట్టును నాటి పెంచి పూజించడం వల్ల దంత సమస్యలు నయం అవడంతోపాటు మధుమేహం కూడా నియంత్రణలోకి వస్తుంది.
పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మచెట్టును పూజించడం వల్ల కీళ్ల నొప్పులు, వాత నొప్పులు తగ్గుతాయి.
ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టును నాటి పెంచడం వల్ల చర్మ వ్యాధులు నయం అవడంతోపాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు తెల్ల జిల్లేడు చెట్టును నాటి పూజించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు.
ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును నాటి పూజించడం వల్ల మెదడు సంబంధత సమస్యలు నయం అవడంతోపాటు తెలివితేటలు కూడా పెరుగుతాయి.
శతభిష నక్షత్రం వారు అరటి చెట్టును నాటి పూజించాలి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల సమస్యలు తగ్గడంతోపాటు మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది.
పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు మామిడి చెట్టును పెంచడం వల్ల వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
ఉత్తరాభాధ్ర నక్షత్రం వారు వేప చెట్టును పెంచడం వల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉండడంతోపాటు ఉన్నత పదవులకు కూడా చేరుకుంటారు.
రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును నాటి పూజించాలి. ఇలా చేయడం వల్ల చేసే పనుల్లో విజయం సాధిస్తారు.
ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి మొక్కలను నాటడం వల్ల మనకు మంచి జరగడంతోపాటు, ఆరోగ్యం కూడా బాగుంటుందని పండితులు అంటున్నారు. నక్షత్రాలకు మొక్కలు రోగాలకు ఏంటి సంబంధం అంతా సోది అనుకునేవాళ్లు ఉంటారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి.. దేవుడు ఉన్నాడని కొందరు నమ్ముతారు లేడని ఇంకొందరు అంటారు.. ఇదీ అంతే..!