ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరులో మార్పు చేసింది. డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రిలిమినరీ ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. జగన్ సర్కార్ రాష్ట్రంలో గతంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచిన సంగతి తెలిసిందే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. అయితే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వానికి వినతులు అందాయి.
దీంతో సానుకూలంగా స్పందించి పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ జిల్లాకు డా.బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీనికోసం పలుచోట్ల నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. దీంతో కోనసీమ జిల్లా పేరులో డా. బిఆర్ అంబేద్కర్ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మార్పు పై అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది.