భారత దేశంలోనే అతిపెద్ద వయసున్న రాయల్ బెంగాల్ టైగర్ రాజా మరణించింది. పశ్చిమబెంగాల్ అలిపురుద్వార్ జిల్లాలోని జల్దపారా అడవిలో రాజా మరణించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు రాజా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో రాజా మృతదేహంపై అధికారులు పుష్ఫగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన రాయల్ బెంగాల్ జాతికి చెందిన పులిగా ప్రసిద్ధి చెందింది. 2008లో సుందర్‌బన్స్ లోని మాట్లా నదిని దాటుతుండగా మొసలి దాడి చేయడంతో రాజాకు తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో రాజాను రెస్క్యూ టీమ్ 2008 నుంచి సౌత్ ఖైర్‌బారి టైగర్ రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. ఈ మేరకు రాజులో గాయపడిన అవయవాలపై కృత్రిమ అవయవాలను అమర్చినట్లు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దేబాల్ రాయ్ అన్నారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాజాకు లేవని, వయసు మీద పడటంతో మరణించినట్లు ఆయన తెలిపారు. కాగా, అటవీ అధికారులు వివరాల ప్రకారం.. రాజా ప్రస్తుత వయసు 25 ఏళ్ల 10 నెలలు ఉంది. కాగా, దేశంలోనే అత్యధిక వయసు ఉన్న బెంగాల్ టైగర్‌గా రాజా రికార్డు సృష్టించాడు.