- బీజేపీకి వలసలు కలిసివచ్చేనా?
- జతకట్టిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు !
- అక్కడి నుంచే పోటీ చేస్తా.. అయితే నా చేతిలో ఓటమి ఖాయం !
- సొంత నేతల వ్యాఖ్యలతో ఇరకాటంలో మమతా బెనర్జీ !
కోల్‌కతాః రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ, అధికార పార్టీల మధ్య వున్న వైరం రానున్న ఎన్నికలతో మరింతగా ముదురుతోంది. ఇక కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చతికిల పడుతూ వస్తోంది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మేటిగా ఉండి.. చెరగని ముద్రవేసిన లెఫ్ట్ పార్టీలు సైతం ఇతర పార్టీల పోటీలో వెనుకంజ వేస్తున్నట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా నిన్నమొన్నటి వరకూ ఒకే గూటికి చెందిన నేతలు వీడిపోయి.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, బీజేపీ వలసలను ప్రొత్సహించడంతో బెంగాల్ రాజకీయం మరింతగా వేడెక్కుతోంది.
బెంగాల్‌లో తాజా పరిస్థితులను గమనిస్తే.. ఎన్నికల సమయానికి రాజకీయ సమీకరణాలు ఏ స్థాయిలో మారతాయో ఊహకు అందని స్థాయిలో ఇప్పడే రాష్ట్రంలో రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్.. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తీవ్ర విమర్శలు, ఆరోపణలతో సతమతమవుతోంది. ఇలాంటి తరుణంలో సొంత పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలు సైతం దీదీని ఇరకాటంలో పడేస్తున్నాయి. తాజాగా మమతా సోదరుడు కార్తిక్ బెనర్జీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని వ్యాఖ్యానించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఇక తృణముల్ ను వీడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం దీదీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది తెలుస్తోంది. ఇప్పటికే కీలక నేత అయిన సువేందు అధికారి సహా పలువురు నేతల పార్టీని వీడటం, తాజాగా పలువురు నేతలు దీదీ సమావేశానికి డుమ్మా కొట్టడం తృణముల్ శ్రేణుల్లో నిరసత్వాన్ని నింపుతున్నాయి. ఇక సోమవారం దీదీ మాట్లాడుతూ.. నందిగామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించింది. అయితే, గంటల వ్యవధిలో పార్టీని వీడిన సువేందు అధికారి సైతం అక్కడి నుంచే పోటీ చేస్తాననీ, 50 వేల ఓట్ల మెజారీటితో దీదీని ఓడిస్తానంటూ వ్యాఖ్యానించడం రాజకీయ కాకా రేపుతోంది.
ఇక బీజేపీ అయితే, ఇతర రాష్ట్ర ఎన్నికల్లో లభించిన బూస్ట్ తో ఉత్సాహంగా ఊరకలేస్తోంది. ఎలాగైన బెంగాల్ అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ.. వలసలను ప్రొత్సహిస్తూ.. ఇతర పార్టీల కీలక నేతలకు గాలం వేసే పనిలో నమగ్నమైంది. తాజాగా బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్.. తృణముల్‌కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలు బీజేపీ చేరబోతున్నారనీ, ఫిబ్రవరిలో ముహుర్తం ఫిక్స్ అయిదంటూ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. దీనికి అనుగుణంగానే బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి సారించిందనిపిస్తోంది. అలాగే, కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలు కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి.
ఇక బెంగాల్‌లో ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోంటోంది. ఎలాగైన ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టి అధికారం కైవసం చేసుకునీ… ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు పునర్ వైభవం తీసుకురావలను కుంటోంది. దీనిలో భాగంగానే బెంగాల్ అధికార పీఠం దక్కించుకోవడానికి లెఫ్ట్ పార్టీలతో కలిసి ముందుకు సాగడానికి సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో లెప్ట్ పార్టీలతో కాంగ్రెస్ జతకట్ట నుందని, సీట్ల పంపిణీ సైతం ఈ నెలాఖరు వరకూ పూర్తి కానున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. అలాగే, తృణముల్ గుండా రాజకీయాలు, బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నాయనీ, ఇవి బెంగాల్ కు తీవ్ర నష్టం కలిగిస్తాయని అప్పుడే లెఫ్ట్ పార్టీస్ కూటమి నేత బిమన్ బోస్ ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు. ఇది ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, క్షేత్ర స్థాయిలో ఈ పార్టీల బలమైన పునాదులు పేలవం అవుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టాలంటే చాలా కృషి చేయాల్సిన అవసరముందని వారు పేర్కొంటున్నారు.
ఇక గత ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. మొత్తం 295 సీట్లలో 211 స్థానాలు గెలుచుకుని తృణముల్ అతిపెద్ద పార్టీగా అవతరించి, అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్ 44 స్థానాలు, లెఫ్ట్ పార్టీలు 40 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష హోదాలో నిలిచాయి. బీజేపీ అయితే, అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయింది. అయితే, ప్రస్తుత బెంగాల్ రాజకీయ సమీకరణాలను గమనిస్తే.. రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, తృణముల్ మధ్య త్రిముఖ పోటీ ఉండనున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, బీజేపీ ఓటింగ్ రోజు వరకూ ఇదే దూకుడు కొనసాగిస్తే అనున్న ఫలితాలు రాబట్టడంలో విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కూటమి పుంజుకుంటే గనక ఎన్నికల సమయానికి ఫలితాలు పూర్తిగా మారే అవకాశము లేకపోలేదని పేర్కొంటున్నారు. తృణముల్ సైతం ఇతర పార్టీలకు గట్టిపోటీ ఇవ్వనుందనీ, దీదీ మార్కును చూపుతూ.. ఇంకా అధికార నేతలు పార్టీ వీడకుండా చూస్తే.. మళ్లీ అధికార పీఠం దక్కించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని అభిప్రాయపడుతున్నారు.