ఓ వ్యక్తి తన బైక్ పోయిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు బైక్ దొంగలను పట్టుకొని తన బైక్ ఇప్పిస్తారనుకున్నాడు.. కొన్ని నెలలు గడిచిపోయిన తరువాత.. ఇక బైక్‌పై ఆశలు వదిలిపెట్టుకున్న ఆ వ్యక్తికి.. 8 ఏళ్ల తరువాత తన బైక్‌పై ఈ చలాన్ ఇంటికి వచ్చింది. దీంతో ఈ చలాన్‌ను లో ఉన్న ఫోటో చూసి ఖంగుతిన్నాడు సదరు వ్యక్తి. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు.. పోలీసులే.. అవును.. అతని బైక్‌ను పోలీసులే నడుపుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్లు తేలింది. ఈ ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వెలుగు చూసింది. ఇమ్రాన్ అనే వ్యక్తి నడిపే హోండా సీడీ 70 బైక్.. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం పోయింది.
పోలీసులకు ఫిర్యాదు చేసినా రికవరీ జరగలేదు. ఆశలు వదిలేసుకొని అతను తన జీవనం సాగిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఇటీవల అతనికి ఒక ఈ-చలాన్ వచ్చింది. దానికి సంబంధించిన ఫొటోలో.. పోలీసులే తన బండి నడుపుతూ కనిపించడంతో ఇమ్రాన్ ఆశ్చర్యపోయాడు. నేరుగా వెళ్లి చీఫ్ సివిలియన్ పర్సనల్ ఆఫీసర్ (సీసీపీఓ)కి ఫిర్యాదు చేసి, తన బైక్ తనకు ఇప్పించాలని కోరాడు.