ఇక ఏపీలో బెనిఫిట్ షోలు ఉండవు : మంత్రి పేర్ని నాని

ఇక ఏపీలో బెనిఫిట్‌ షోలు ఉండబోవని సమాచార శాఖ మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. జీవో 35 ప్రకారం బెనిఫిట్ షో లకు ప్రత్యేక అనుమతి ఉంటుందని..అది కూడా చారిటీస్ కోసం మాత్రమే అనుమతి ఇస్తామని ఆయన వివరించారు. చట్టం ప్రకారం ఇప్పటి వరకు నాలుగు ప్రదర్శన లు మాత్రమే చేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు.

ఇప్పటి వరకు బెనిఫిట్ షో ల పేరిట వేసింది దొంగ ఆటలు మాత్రమేనని.. ఏపీ శాసనసభలో సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించామని… ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాలకు మార్గం సుగమం అయ్యిందని తెలిపారు. ఇప్పటి వరకు థియేటర్ల ఇష్టా ఇష్టాల మీద ఆధార పడి టికెట్ల విక్రయాలు జరిగేవని… బస్సు, రైలు, విమాన టికెట్ల తరహాలోనే సినిమా టికెట్ల విక్రయిస్తామని తెలిపారు. సులభతరంగా సినిమా టికెట్ల విక్రయం జరిగేలా ఈ ప్రక్రియ ఉంటుందని… 1100 థియేటర్లలో ఆన్ లైన్ లో విక్రయం చేపడతామని ప్రకటనచ చేశారు.

సినిమా రిలీజ్ ల సమయంలో అధిక ధరలకు టికెట్లు విక్రయం చేయకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని… ఇక నుంచి బెనిఫిట్ షోలకు అవకాశం లేకుండా నిబంధనలు తయారు చేశామన్నారు. 200 నుంచి 1000 రూపాయల వరకు టికెట్లు బ్లాక్ లో విక్రయించే విధానం ఉండేదని… ప్రజల నుంచి దోచుకునే పరిస్థితి ని నియంత్రణ చేసేందుకు ఈ ప్రక్రియ ఉంటుందన్నారు.