అమ్మానాన్నల తర్వాత అంతగొప్ప ప్రేమను పంచేది స్నేహితులే. అమ్మానాన్నలకు చెప్పుకోలేని విషయాలు మనం పంచుకునేది ఫ్రెండ్స్‌తోనే. మన కుటుంబం తర్వాత మన గురించి ఆలోచించేది.. మన శ్రేయస్సును కోరుకునే వాళ్లెవరైనా ఉన్నారంటే అది మన మిత్రులే. కష్టాల్లో తోడుంటూ.. ఆనందాన్ని డబుల్ చేస్తూ.. ఎల్లవేళలా వెంటే ఉంటూ.. మన బాధపడినప్పుడు ఆ బాధ నుంచి మనల్ని బయటకు తీసుకొస్తూ.. మనం కష్టాల్లో ఉన్నప్పుడు చేయి చాచి సాయం చేస్తూ.. ఇలా అనుక్షణం మనలో మమేకమై ఉండే ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ ఎంత హ్యాపీగా జాలీగా ఉంటుందో. అయితే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా.. వారి మధ్య కొన్ని పరిమితులు ఉండాలి అంటున్నారు మానసిక నిపుణులు. లేకపోతే కొన్నిసార్లు మనసుపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
ఫ్రెండ్షిప్లో నీది నాది అనేది ఉండదు. అంతా మనది.. మనమే. స్నేహితుల మధ్య సారీ, థ్యాంక్యూలు కూడా ఉండవు. కానీ ఏదైనా రెండువైపుల ఉంటేనే బెటర్. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. మీరు మాత్రమే మనం అనుకునే భావనలో ఉండి.. మీ స్నేహితుడు మాత్రం నేను, నాది అనే ఫీలింగ్‌లో ఉంటే తర్వాత మీరే హర్ట్ అవుతారు.
ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లినప్పుడు తరచూ మీతోనే ఖర్చు పెట్టిస్తుండటం, ప్రతి చిన్నదానికీ మీమీదే ఆధారపడటం మంచిది కాదు. మీ వ్యక్తిగత వివరాలను గుచ్చి గుచ్చి అడగడం, మీరు ఇబ్బంది పడుతున్నా గమనించక పోవడం నిజమైన స్నేహితులు/స్నేహితురాలి లక్షణం కాదు.
చిన్న సాయాలు, తప్పుల విషయంలో. ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మిమ్మల్ని బాధపెట్టి, ఆ విషయం తెలిసీ క్షమాపణ అడగలేదంటే.. మీ భావోద్వేగాలకు విలువ ఇవ్వట్లేదనే! అందుకే ఫ్రెండ్‌షిప్‌లోనూ సారీ, థ్యాంక్యూ ఉండాల్సిందే. లేకపోతే అనర్థాలు తప్పవు.
టాలెంట్, నేపథ్యాలు, అంతస్తులు లెక్క లేసుకుని చేసేది స్నేహం కాదు. మనం ఏదైనా సాధిస్తే మనకంటే ఎక్కువ ఆనందం ఫ్రెండ్స్‌కే ఉంటుంది. తనకు రాకపోయినా కనీసం మీకొచ్చినందుకు అభినందించొచ్చు. అలా కాక ఆ ఆనందాన్ని ఆవిరి చేసేలా మాట్లాడుతున్నా, కుంగిపోయేలా చేస్తున్నా వారికి దూరంగా ఉండటమే మంచిది.
పరిస్థితులు, సమయానికి తగ్గట్టుగా ఎవరైనా మారాల్సిందే. అయితే ఆ మార్పు మీకూ సౌకర్యవంతంగా ఉండాలి. దుస్తులు, తీరు విషయంలో మీ విలువలతో రాజీపడాల్సి వస్తే కుదరదని చెప్పండి. అయినా బలవంతం చేస్తోంటే.. మీ అభిప్రాయానికి విలువనివ్వట్లేదనే! అలాంటివారు స్నేహితులెలా అవుతారు.
కనిపించే తీరు, ప్రవర్తన, ధరించే వస్త్రాలు.. ఇలాంటి కొన్ని విషయాల్లో చాలామందిలో ఆత్మన్యూనత ఉంటుంది. దాన్ని పోగొట్టకపోయినా ఫర్లేదు.. కానీ ఎత్తిచూపుతోంటే వాళ్లు స్నేహితులవరు. పక్కన ‘మన’ అన్నవారెవరైనా ఉంటే మనసుకు స్థిమితంగా ఉండాలి. మనం మనలా ఉండగలగాలి. అలా లేరంటే మన వాళ్లు కాదనే.. స్నేహితులు అంతకన్నా కాదనే! వారికి వీలైనంత దూరంగా ఉండటం మేలు.