బరువు తగ్గాలని లావుగా ఉన్న వాళ్లు అందరూ విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు కీటో డైట్ నయా ట్రైండ్ అయిపోయింది. చాలా మంది ఈ డైట్ ద్వారా అధిక బరువును తగ్గించుకుంటున్నారు. అసలేంటి ఈ డైట్.. దీంట్లో ఏం చేస్తారు.. ఇది మంచిదేనా, కాదా అనేది ఈరోజు చూద్దాం.
కీటోజెనిక్ డైట్‌లో తక్కువ కార్బోహైడ్రేట్, మోడరేట్ ప్రొటీన్, అధిక కొవ్వు పదార్ధాలు ఉంటాయి. ఈ డైట్‌ను వాస్తవానికి 1920వ కాలంలో మూర్ఛ, మధుమేహంతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడానికి ఫాలో అయ్యేవారు. కానీ ప్రస్తుతం బరువు తగ్గడానికి కీటో డైట్‌ను అనుసరించడం ప్రారంభించారు. కీటో డైట్‌లో సాధారణంగా శరీరంలోని కణాలకు శక్తి ప్రధానంగా ఉండే వనరు అయిన గ్లూకోజ్‌ను కొవ్వుతో భర్తీ చేయడం, శరీరాన్ని కీటోసిస్ అని పిలిచే జీవక్రియ స్థితికి మార్చడం లక్ష్యంగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి బరువు తగ్గిస్తుంది.
కీటో డైట్‌లో అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలను తినకూడదు.. దీంతో శరీరానికి శక్తి అందించే గ్లూకోజ్‌కు బదులుగా ఆహారంలో ప్రోటీన్ లభించే వాటిని, అధిక కొవ్వు పదార్థాలను తీసుకుంటారు. కీటో డైట్‌లో శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడానికి కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మన శరీరం గ్లూకోజ్‌ను కాకుండా కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. అయితే అలా శరీరం కొవ్వును ఉపయోగించుకోవాలంటే మనం కీటోజెనిక్ డైట్‌ను పాటించాలి. అందుకు తగిన ఆహారాలను తినాలి.
కీటోజెనిక్ డైట్ ఫుడ్స్ ఏవి ?
కొవ్వు పదార్థాలన్నీ కీటోజెనిక్ ఫుడ్స్ కిందకు వస్తాయి. నట్స్, మాంసాహారం, చేపలు వంటి ఆహారాలు. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ పదార్థాలను కీటోజెనిక్ డైట్‌లో ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. కార్బొహైడ్రేట్లను చాలా తక్కువగా తీసుకోవాలి. 50 గ్రాముల మోతాదు కన్నా తక్కువగా కార్బొహైడ్రేట్లను తీసుకోవాలి. ఇక నిత్యం తినే ఆహారంలో కొవ్వు పదార్థాలతోపాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. చికెన్, మటన్, సాల్మన్ చేపలు, రొయ్యలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండే అన్ని ఆకుకూరలు, కూరగాయలు, నట్స్, గింజలు (అవిసెలు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు), బెర్రీ పండ్లు, కొబ్బరినూనె, వెన్న, నెయ్యి, చీజ్, పాల మీద మీగడ, కోడిగుడ్లు, ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ వంటివి కీటో డైట్‌లో తీసుకునే ముఖ్యమైన ఆహారాలు.
కీటో డైట్‌లో తినకూడని ఆహారాలు
గోధుమలు, మొక్కజొన్న పొత్తులు, తృణ ధాన్యాలు, బియ్యంతో తయారుచేసిన పదార్ధాలు తినకూడదు. తేనె, చక్కెర లాంటి తీపి పదార్థాలు తినరాదు. యాపిల్, అరటిపండ్లు, నారింజ పండ్లను తినరాదు. ఆలుగడ్డలు, క్యారెట్లు వంటి దుంపలు తినరాదు. కార్బొహైడ్రేట్లు ఉండే ఇతర అన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. వేపుళ్లు, చిరుతిండి, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.
కీటోజెనిక్ డైటింగ్ రకాలు
స్టాండర్డ్ కీటోజెనిక్ డైట్ (SKD): ఈ డైటింగ్‌లో కేవలం 10 శాతం మాత్రమే కార్బోహైడ్రేట్లు, 20 శాతం మోడరేట్ ప్రొటీన్, 70 శాతం అధిక కొవ్వు కలిగిన పదార్థాలను తీసుకుంటారు.
సైక్లికల్ కీటోజెనిక్ డైట్ (CKD): ఈ రకమైన కీటో డైట్‌కు ‘రీఫీడ్స్’ వ్యవధి అవసరం. అంటే 5 రోజుల కీటో డైట్ తర్వాత 2 రోజులు అధిక కార్బోహైడ్రేట్లు తీసుకోవడం అవసరం.
హై ప్రోటీన్ కీటోజెనిక్ డైట్ (HPKD): SKD లాగానే హై ప్రోటీన్ కీటో డైట్‌లో తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక కొవ్వు ఆహారం ఉంటుంది, కానీ అధిక ప్రోటీన్ ఆహారాలు కూడా ఉంటాయి. ఈ నిష్పత్తిలో 60 శాతం కొవ్వు, 5 శాతం పిండి పదార్థాలు, 35 శాతం ప్రోటీన్లు ఉంటాయి.
టార్గెటెడ్ కీటోజెనిక్ డైట్ (TKD): టార్గెటెడ్ కీటో డైట్‌ని అనుసరించేవారు వారి వ్యాయామ సమయంలో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లను తీసుకోవచ్చు.
కీటో డైట్ లక్షణాలు..
మీరు కీటోసిస్ డైట్‌ను ఫాలో అయితే.. అది వర్కౌట్ అవుతుందో లేదో.. తెలియజేయడానికి కొన్ని లక్షణాలు సంకేతాలుగా పనిచేస్తాయి. నోరు పొడిబారడం, దాహం వేయడం, తరచుగా మూత్రవిసర్జన, ఎక్కువ ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ఈ డైట్‌లో సంభవిస్తాయి. అలసటగా ఉంటుంది. ఒళ్లు నొప్పులు వస్తాయి. తలనొప్పిగా ఉంటుంది. శరీరంలో నీరు అంతా బయటకు పోతుంది కాబట్టి డీ హైడ్రేషన్ వస్తుంది. అలాగే నోటి దుర్వాసన వస్తుంది. కీటో డైట్‌లో ఈ లక్షణాలు ఒకటి, రెండు రోజులు మాత్రమే ఉంటాయి. తరువాత తగ్గిపోతాయి. ఈ దశ దాటితే ఇక మీ శరీరం కొవ్వును ఇంధనంగా వాడుకోవడం మొదలు పెడుతుందనమాట..
దీంతో ఈ దశ తరువాత శరీరంలో కొవ్వు కరగడం మొదలవుతుంది. ఈ దశ ఎంటర్ అయ్యాక వారం లోపే శరీర బరువులో చెప్పుకోదగిన మార్పు ఉంటుంది. మీరు పైన చెప్పినవి తట్టుకోలేక.. ఇదేదో తేడాగా ఉందే అని డైట్ స్కిప్ చేస్తే.. డైట్ బిస్కెట్ అయినట్లే..!
కీటోజెనిక్ డైట్ వల్ల కలిగే లాభాలు..
చర్మ సమస్యలు ఉండవు
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది
డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి.
క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి
కీటోజెనిక్ డైట్‌ను పాటించడం వల్ల నడుం చుట్టుకొలత భారీగా తగ్గుతుంది.
అధిక బరువును తక్కువ సమయంలోనే తగ్గించుకోవచ్చు.
మహిళలు పీసీవోఎస్ సమస్య నుంచి బయటపడవచ్చు
కీటోజెనిక్ డైట్‌ను 21 రోజుల పాటు పాటిస్తే అధిక బరువు త్వరగా తగ్గిపోతుంది.. డయాబెటిస్ ఉన్నవారు అయితే ఇంకొన్ని రోజులు ఎక్కువగా ఈ డైట్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.. అయితే వైద్యుల సలహా మేరకు ఈ డైట్‌ను పాటిస్తే మంచిది. లేదంటే కిడ్నీల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
వైద్యుల సలహా లేకుండా మీరు ఈ డైట్ ఫాలో కాకూడదు. మీరు ఈ డైట్ మొదలుపెట్టాలనుకున్నప్పుడు.. వైద్యులను సంప్రదిస్తే.. మీ ఆరోగ్యాన్ని బట్టి ఇప్పుడు మొదలపెట్టోచ్చా లేదా.. ఏ టైప్ మీకు సరిపోతుంది ఇవన్నీ చూసి.. వాళ్లు సలహా ఇస్తారు.. దాన్ని బట్టి మీరు డైట్ స్టాట్ చేయొచ్చు. అలా కాకుండా.. మీకు మీరే సొంతంగా స్టాట్ చేస్తే.. ప్లాన్ బోల్తా కొట్టి.. కిడ్నీలు దెబ్బతింటాయి.
-Triveni Buskarowthu