ఇటీవల ఏపీలో బుడమేరు కాలువకు గండ్లు పడి విజయవాడ నగరం ముంపునకు గురైన విషయం తెలిసిందే. అందుకు గల అసలు కారణాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వివరించే ప్రయత్నం చేశారు. కొల్లేరు సరస్సు చుట్టూ ఆక్రమణలు పెరిగిపోవడం వల్లే బుడమేరు భారీ వరద ప్రవాహం వచ్చిందన్నారు.కొల్లేరు తడి భూములు, పక్షుల సేద తీరే అభయారణ్యం ఆక్రమణలకు గురైందని చెప్పుకొచ్చారు.
కొల్లేరు పరిరక్షణపై సుప్రీంకోర్టు కూడా ధిక్కరణ నోటీసులు జారీ చేసిందన్న ఆయన.. కొల్లేరు సరస్సు వద్ద ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. వెంటనే కొల్లేరు పరిసరాల్లో చేపట్టిన ఆక్రమ నిర్మాణలను ఆలస్యం చేయకుండా కూల్చివేయాలని డిమాండ్ చేశారు. 100 చదరపు మైళ్ల వైశాల్యం ఉన్న కొల్లేరు సరస్సు ఇప్పుడు కేవలం 20 నుంచి 25 ఎకరాలు మాత్రమే మిగిలిందని చెప్పారు. దీనిపైనే వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనియెడల భవిష్యత్‌లోనూ బుడమేరు లాంటి ఘటనలు జరుగుతాయన్నారు.