మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన సంభవించింది. మృతి చెందిన వారిలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు భద్రతా దళాలు వెల్లడించారు. కాగా, ఈ ముగ్గురు మావోయిస్టులపై మొత్తంగా రూ.30 లక్షలు రివార్డు కూడా ఉన్నట్లు సమాచారం.
మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ‘మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా బహేలా పోలీస్ స్టేషన్‌లో భద్రతా దళాల మధ్య మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. వీరిపై రివార్డు ఉంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.’ అని పేర్కొన్నారు.
చనిపోయిన వారిలో డివిజినల్ కమిటీ సభ్యుడు నగేష్‌పై రూ.15 లక్షల రివార్డు ఉంది. ఏరియా కమాండర్ మనోజ్, రమే అనే మహిళపై చెరో రూ.8 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో కూబింగ్ నిర్వహిస్తుండగా.. ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.