యూజర్లకు చెందిన విలువైన సమాచారాన్ని సేకరించడమే కాక.. దాన్ని చైనాలోని సర్వర్లకు చేరవేస్తుందన్న కారణంతో బైట్ డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్‌ను భారత్ నిషేధించిన విషయం విదితమే. టిక్‌టాక్‌తో కలిపి మొత్తం 59 యాప్‌లను భారత్ నిషేధించింది. ఇక అమెరికా కూడా టిక్‌టాక్, వీచాట్ యాప్‌లను త్వరలో నిషేధించనుంది. అక్కడ కూడా టిక్‌టాక్‌పై ఇవే ఆరోపణలు ఉన్నాయి. అయితే అవి నిజమేనని తేలింది.
వాల్‌స్ట్రీట్ జర్నల్ బయటకు వెల్లడించిన నివేదిక ప్రకారం.. 15 నెలలుగా టిక్‌టాక్ ఆండ్రాయిడ్ యాప్ యూజర్ల ఫోన్లకు చెందిన మాక్ అడ్రస్‌లను వారికి తెలియకుండానే సేకరించిందని.. ఇది సమాచారం చోరీ కిందకు వస్తుందని వెల్లడైంది. అలా సేకరించిన మాక్ అడ్రస్‌ల ద్వారా టిక్‌టాక్ తన యాప్‌లో యాడ్స్‌ను ఇచ్చిందని నిర్దారణ అయింది. కాగా గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో 2015లోనే ఇలా యూజర్ల డివైస్‌లకు చెందిన మాక్ అడ్రస్‌లు, ఐఎంఈఐ నంబర్లను యాప్ డెవలపర్లు సేకరించకుండా నిబంధనలు విధించింది. కానీ టిక్‌టాక్ వాటిని లక్ష్య పెట్టకుండా బేషరతుగా యూజర్ల డివైస్‌లకు చెందిన మాక్ అడ్రస్‌లను సేకరించింది. దీంతో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.
కాగా టిక్‌టాక్ కు చైనా నుంచే పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. మొత్తం ఆదాయంలో చైనా నుంచి వస్తున్న ఆదాయం 72.3 శాతంగా ఉంది. తరువాత 19 శాతంతో అమెరికా రెండో స్థానంలో నిలవగా, 2 శాతంతో బ్రిటన్ 3వ స్థానంలో నిలిచింది. మొత్తం ఇప్పటి వరకు టిక్‌టాక్‌లో 456.7 మిలియన్ డాలర్లను యూజర్లు ఖర్చు చేశారు.